Saturday, 29 June 2013

APPSC News

ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి రెండేళ్లు సడలింపు
హైదరాబాద్, జూన్ 29: నిరుద్యోగులకు కాస్తంత ఊరట. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని ఐదేళ్లు పెంచాలని వారు కోరుతుండగా.. రెండేళ్లే సడలిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం.518) జారీ చేసింది. ప్రస్తుత వయోపరిమితి 34 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్,1996 లోని 12వ రూల్ కింద ఉన్న కేటగిరీలకూ ఈ సడలింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సడలింపును అడ్‌హాక్ రూల్‌గా పరిగణించాలని స్పష్టం చేసిందిఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ), ఇతర రిక్రూటింగ్ ఏజన్సీల ద్వారా నేరుగా చేపట్టే నియామకాల(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్)కు గరిష్ఠ వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి విడుదలయ్యే నోటిఫికేషన్లకే ఇది వర్తిస్తుంది. ఈ సడలింపు నుంచి పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖలను మినహాయించారు. కాగా, త్వరలో వేలాది ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేప«థ్యంలో నిరుద్యోగ యువత, పలు సంఘాలు, ఇతర ప్రముఖుల నుంచి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్లలో వయోపరిమితిని పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, పలువురు మంత్రులను కలిసి విన్నవించారు. నిర్దిష్ట కాలావధిలో ఖాళీ పోస్టుల భర్తీ జరగనందున గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్ల వరకు(34 నుంచి 39కి) సడలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కానీ దీనిపై భిన్నకోణాల్లో ఆలోచించిన ప్రభుత్వం సడలింపును రెండేళ్లకే పరిమితం చేసి వయోపరిమితిని 39 ఏళ్లకు పెంచితే.. బాగా పనిచేసే యువతకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం








Source:Andhra Jyothi

Thursday, 27 June 2013

జారితే ఎక్కడ ఆగుతానో నాకే తెలియదు -రూపాయి

జారితే ఎక్కడ ఆగుతానో నాకే తెలియదు -రూపాయి

Rupee free fall
రూపాయి పరిస్ధితి కడు దయనీయంగా మారింది. రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకున్నా వినకుండా పాతాళంలోకి వడి వడిగా జారిపోతోంది. బుధవారం, చరిత్రలోనే ఎన్నడూ లేనంత అధమ స్ధాయికి దిగజారి డాలర్ కి రు. 60.72 పైసల దగ్గర ఆగింది. సమీప భవిష్యత్తులో ఈ జారుడు ఆగే సూచనలు కనిపించడం లేదనీ మరింతగా రూపాయి విలువ పతనం కావచ్చని విశ్లేషకులు, మార్కెట్ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రూపాయి పతనానికి కారణం గత ఆర్టికల్ లో చర్చించినట్లు ఎఫ్.ఐ.ఐ (ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) లు భారత స్టాక్ మార్కెట్ల నుండి ఉపసంహరించుకుని డాలర్ పెట్టుబడుల్లోకి పరుగులు పెట్టడమే.
బుధవారం రూపాయి కోల్పోయిన విలువ డాలర్ తో పోలిస్తే అక్షరాలా 106 పైసలు. అనగా క్రితం రోజుతో పోలిస్తే ఇది 1.78 శాతం తగ్గుదలకు సమానం. జూన్ 10వ తేదీన ఇదే స్ధాయిలో పతనం చవి చూసిన రూపాయి డాలర్ తో పోలిస్తే 109 పైసలు (1.91 శాతం) పడిపోయింది. డాలర్ల కోసం డిమాండ్ పెరగడంతో రూపాయి పతనం అరికట్టడానికి ఆర్.బి.ఐ వల్ల కూడా కాలేదు.
ఒక్క బుధవారమే ఎఫ్.ఐ.ఐ లు 550 కోట్ల మేర స్టాక్ మార్కెట్లను వదిలి వెళ్లిపోయాయి. ఈ మొత్తాన్ని కలుపుకుంటే జూన్ నెలలో ఇప్పటివరకు ఇండియా నుండి తరలి వెళ్ళిన ఎఫ్.ఐ.ఐ ల విలువ 9,000 కోట్ల రూపాయలు. ఋణ రంగంలో అయితే జూన్ నెలలో ఇప్పటివరకూ ఏకంగా రు. 27,850 కోట్లు భారత మార్కెట్లను ఖాళీ చేసి వెళ్లిపోయాయని ది హిందు తెలిపింది.
ఒక మార్కెట్ విశ్లేషకుడిని ఉటంకిస్తూ పత్రిక ఇలా తెలిపింది. “రూపాయి విలువ 59.90 పైసల వద్ద ఉన్నపుడు ఆర్.బి.ఐ జోక్యం చేసుకుంది. ఈ దశలో 5-10 పైసల రేంజిలో రూపాయి ట్రేడ్ అవుతోంది. కానీ రూపాయి విలువ డాలర్ కి 60 రూపాయల మార్క్ దాటిన మరుక్షణమే స్టాప్-లాస్ (నిర్దేశించబడిన మార్క్ ను తాకినపుడు ఆటోమేటిక్ గా అమ్మకం జరిగేలా ఏర్పాటు చేయబడిన మార్కు) ప్రేరేపించబడింది. దానితో రూపాయి తీవ్రంగా నష్టపోయింది.”
ప్రభుత్వం, ఆర్.బి.ఐ లు తగిన చర్యలు తీసుకోకపోతే త్వరలోనే రూపాయి విలువ డాలర్ కి రు. 62 – రు. 62.50 పై.లు మార్కు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెన్ బెర్నాంక్ అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతోందన్న సూచనలు ఇస్తుండడంతో డాలర్ భద్రమైన పెట్టుబడుల గమ్యంగా అవతరించి ఎఫ్.ఐ.ఐ లను ఆకర్షిస్తోంది. దీనితో డాలర్ విలువ బలపడి రూపాయి లాంటి వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి.
స్టాండర్డ్ చార్డర్డ్ బ్యాంకు నివేదిక ఇలా పేర్కొంది. “బలహీన రూపాయి ద్రవ్యోల్బణం ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది, కోశాగార లోటును (ఫిస్కల్ డెఫిసిట్) పెంచుతుంది. పెట్టుబడుల ప్రవేశం మందగింపజేస్తుంది. కానీ కరెంటు ఖాతా లోటుపైన ఎలాంటి సానుకూల ప్రభావమూ చూపదు. వేగవంతమైన పతనం బిజినెస్ సెంటిమెంటు పైన ప్రతికూల ప్రభావం సైతం చూపుతుంది.” ఏ పరిణామాలనైతే అడ్డుకోవాలని ప్రధాని, ఆర్ధిక మంత్రి శతవిధాలా ప్రయత్నిస్తున్నారో రూపాయి పతనం సరిగ్గా అదే పరిణామాలకు బాటలు వేస్తోందన్నమాట! మరి రెండు దశాబ్దాల నూతన ఆర్ధిక విధానాలు ఎవరికి లబ్ది చేకూర్చినట్లు?

Copied From: teluguvartalu.