Wednesday 5 September 2012

Andhrajyothi-మతం సుడిలో ముంబై

దీపశిఖ:
మతం సుడిలో ముంబై
రాజ్‌దీప్ సర్దేశాయ్

ఇది హిందువుల ప్రాంతం, ఇది ముస్లింల ప్రాంతం అని చెప్పదగ్గ ప్రదేశాలు ముంబైలో ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు వాటి మధ్య విభజన రేఖలు స్పష్టంగా ఏర్పడ్డాయి. మురికివాడలలో నివసించే వారి మధ్య ఆర్థిక అవసరాల దృష్ట్యా మతపరమైన విభేదాలు అంతగా ఉండేవి కావు. అవి వైషమ్యాలుగా పరిణమించకుండా జాగ్రత్తపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వారి మధ్య కూడా ఇప్పుడు అదృశ్య సరిహద్దులు నెలకొన్నాయి.

ముంబైలో అల్లర్లు. ఆశ్చర్యపోవాలా? ఈ మహానగరంలో మూక హింసాకాండ ప్రజ్వరిల్లిన ప్రతిసారీ నగర కులీన వర్గాలు దిగ్భ్రాంతికి లోనుకావడం వింతగా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో ముంబైలో రక్తపాతం ఎంతగా జరగలేదు కనుక! ఒక వాస్తవాన్ని స్పష్టంగా చూద్దాం: 1992-93 భయానక అల్లర్లు - ముంబై నగర జీవనంలో ఒక మలుపు; ఈ సంఘటనలో 900 మందికి పైగా చనిపోగా 2,000 మందికి పైగా గాయపడ్డారు - అనంతరం సంభవించిన వీధి పోరాటాలు, ఉగ్రవాద దాడుల్లో, దేశంలోని మరే మహా నగరంలో కంటే, ముంబైలోనే ఎక్కువ మంది చనిపోయారు.

కనుకనే, కొద్ది రోజుల క్రితం కొన్ని ముస్లిం సంస్థల వారు నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా జరిగిన హింసాకాండలో ఇద్దరు చనిపోవడం, మరెందరో గాయపడడం పట్ల ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ముంబై చాలా సంవత్సరాలుగా అగ్ని పర్వతం మీద కూర్చొనివుంది. వాస్తవానికి 1992, 2012 సంఘటనల మధ్య సమాంతర అంశాలు గత రెండు దశాబ్దాలలో ముంబైలో పరిస్థితులు ఏమీ మారలేదని సూచించాయి. 1992లో తొలుత ప్రజ్వరిల్లిన మూక ఆగ్రహావేశాలు ఇప్పుడు ఆజాద్ మైదాన్‌లో బద్ధలైన క్రోధాగ్నుల వంటివే. 2012 సంఘటనలకు అసోం హింసాకాండ కారణమయితే, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఆనాటి ప్రజాగ్రహానికి దారితీసింది. ఈ రెండు సందర్భాలలోనూ ముస్లింలు, పోలీసుల మధ్యే పోరాటం ఉధృతమయింది. ఖాకీ యూనిఫారంలోని వారు పక్షపాత దృష్టి చూపుతున్న రాజ్యవ్యవస్థకు ప్రతినిధులుగా ముస్లింలు భావించారు. ఈసారి హింసాకాండలో మీడియా కూడా చెప్పుకోదగిన స్థాయిలో నష్టపోయింది.

1992-93 హింసాకాండ, శివసేన నేతృత్వంలో జరిగిన అరాచకానికి ప్రతిచర్యగా ప్రజ్వరిల్లింది; నగర ప్రజలలో మతపరమైన విభేదాలను సృష్టించింది. ఈసారి పోలీసులు అసాధారణ సంయమనం చూపి పరిస్థితి మరింతగా విషమించకుండా నియంత్రించారు. అయితే స్పష్టంగా కనపడిన ప్రమాద సంకేతాలను ఎలా విస్మరించగలం? నిజానికి 1992-93 ఘటనల్లో ముస్లిం గ్రూపుల నిరసనలకు తొలుత ఒక ఖచ్చితమైన ప్రతిస్పందన అప్రయత్నపూర్వకంగా లభించింది.

2012 ఘటనల్లో ఒక వ్యవస్థీకృత ప్రవర్తన మరింతగా కన్పించింది. ఇది మరింత సమస్యాత్మకమైనదని ప్రత్యేకంగా చెప్పాలా? తీవ్రవాద మైనారిటీ మత బృందాలు, వాటి రాజకీయ మద్దతుదారులు, నేరస్థుల, ఉగ్రవాదుల మాఫియాలు కలసికట్టుగా ఇటీవలి హింసాకాండకు పాల్పడడం భద్రతా సంస్థలను అమితంగా కలవరపరుస్తోంది. 1992-93 హింసాకాండలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం గణనీయంగా ఉంది; రెండు దశాబ్దాల అనంతరం వాటికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల నుంచి భయానకమైన మారణాయుధాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో డి కంపెనీ ముఠాకు కల ఆయుధాల కంటే ఇవి మరింత ప్రమాదకరమైనవి.

తీవ్రవాద ముస్లిమ్ బృందాలు ఎంత మెరుగ్గా వ్యవస్థీకృతమయ్యాయో వాటి హిందూ ప్రత్యర్థి సంస్థలు కూడా అంతగానూ వ్యవస్థీకృతమై ఉన్నాయి. శివసేన చీలిపోయినా దాని హింసాప్రవృత్తిలో ఎటువంటి మార్పులేదు. శివసేన, దానినుంచి చీలిక వర్గమైన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సమితి మధ్య పోటీదాయక రాజకీయాలు మరింత హింసాత్మక చర్యలకు ప్రోద్భలమవుతున్నాయి. ఇప్పుడు ఉత్తర భారతావని నుంచి వలస వచ్చిన వారిని 'శత్రువులు'గా పరిగణిస్తున్నప్పటికీ భెండిబజార్ ముస్లింల వంటి పాత విరోధులు ఇప్పటికీ శివసైనికుల దౌర్జన్యాలకు లక్ష్యాలుగానే కొనసాగుతున్నారు. ఇక 'హిందూ ఉగ్రవాద' సంస్థల ఆవిర్భావం మరింత కలవరం కల్గిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇవి ఒకదానికొకటి అనుసంధానమై ఉండడం వల్ల ప్రతీకార దాడులు పెచ్చరిల్లి దేశం ఒక హింసాత్మక విషవలయంలో చిక్కుకుపోయే ప్రమాదమెంతైనా ఉన్నది.

సరే, రాజ్యవ్యవస్థ ఇప్పటికే ఈ దాడుల-ప్రతిదాడుల వలయంలో నిస్సహాయంగా చిక్కుకుపోయింది; మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆ ఘటనలకు కారకులైన శక్తులతో రాజీపడింది. గత ఇరవై ఏళ్ళలో మహారాష్ట్ర రాజకీయ వర్గాలలో ఒక మార్పు చోటుచేసుకొంది. ఏమిటది? ఒకప్పుడు నేరస్థుల ముఠాలతో రహస్యంగా కుమ్మక్కైన మహారాష్ట్ర రాజకీయ వర్గాలు ఇప్పుడు ఆ శక్తులతో బాహాటంగానే చెట్టాపట్టాల్ వేసుకొని వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయ వేత్తల-రియల్ ఎస్టేట్ ఆసాముల- నేరస్థ మాఫియాల నియంత్రణలో ఉందనేది రహస్యమేమీకాదు. అనేక ఒత్తిళ్లకు లోనై ఈ సంకీర్ణ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. చివరకు పృధ్వీరాజ్ చవాన్ వంటి నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి సైతం రాజకీయ నైతికత పతనాన్ని నిలువరించలేకపోతున్నారు.

ఈ నైతిక పతనం ఫలితమే పోలీసింగ్ నాణ్యత దిగజారిపోవడం. ప్రతిభ ఆధారంగా కాకుండా రాజకీయ వేత్తలకు చూపే విధేయతను బట్టే పోలీసు అధికారులకు పదోన్నతులు లభిస్తున్నాయి. ఇది పోలీసు వ్యవస్థలో నైతిక స్థైర్యాన్ని అంతకంతకూ దిగజార్చివేస్తోంది. బీట్ కానిస్టేబుల్ చాలా సందర్భాలలో శివసేన భావజాలానికి సానుభూతిపరుడుగా ఉండడం కద్దు; శాంతిభద్రతల పరిరక్షణలో తన విధ్యుక్త ధర్మాన్ని తన రాజకీయ విశ్వాసాల నుంచి విడిగా చూడలేకపోతున్నాడు.

నిజానికి, అధికసంఖ్యాక, అల్పసంఖ్యాక వర్గాలు రెండూ నేర విచారణా వ్యవస్థలో విశ్వాసాన్ని కోల్పోయాయి. 1992-93 అల్లర్లపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను 1995లో అధికారంలోకి వచ్చిన బిజెపి-శివసేన ప్రభుత్వం చరిత్ర చెత్తబుట్టలోకి విసిరివేసింది. దీంతో ప్రభుత్వం శివసేన నాయకులపై ఎటువంటి చర్య తీసుకోదనే నిర్ణయానికి ముంబైలోని మైనారిటీ వర్గాల వారు వచ్చేశారు. శివసేన, దాని చీలిక వర్గమూ పలు సందర్భాలలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ ఎవరో కొద్దిమంది సాధారణ కార్యకర్తలను అరెస్టుచేశారే గాని నాయకులు ఎవరినీ అరెస్టు చేయలేదు. అలాగే రాజకీయ పలుకుబడి ఉన్న మైనారిటీ వర్గ నాయకులను, వారు ఎంతగా హింసను రెచ్చగొట్టినా, అరెస్టు చేసే అవకాశం లేదు. అంతా ఓటు బ్యాంకు రాజకీయాల మహిమ! ఆజాద్ మైదాన్ హింసాకాండ అనంతరం కొద్దిమందిని అరెస్టుచేశారు. అయితే ఆ ఘటనలకు సూత్రధారులైన వారెవరినీ అరెస్టు చేయలేదు.

ఈ కారణంగానే ప్రజల్లో మతపరమైన చీలికలు పెరిగిపోతున్నాయి. మతపరమైన 'వెలివాడ'లు అధికమవుతున్నాయి. 1992-93 అల్లర్లు ప్రజలు పెద్ద సంఖ్యలో స్థానభ్రంశమవడానికి, భద్రత కోసం ఇరుగుపొరుగన స్వమతస్థులే ఉండే ప్రాంతాలకు తరలిపోవడానికి ఎలా దారితీసిందీ సామాజిక శాస్త్రవేత్త మీనా మీనన్ తమ 'టజ్టీౌట ్చnఛీ ్చజ్ట్ఛట జీn ఝఠఝఛ్చజీ' గ్రంథంలో వివరించారు. ఇది హిందువుల ప్రాంతం, ఇది ముస్లింల ప్రాంతం అని చెప్పదగ్గ ప్రదేశాలు ముంబైలో ఎప్పుడూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటి మధ్య విభజన రేఖలు స్పష్టంగా ఏర్పడ్డాయి. విభేదాలు పెరిగిపోయాయి. తిరిగి కలసి మెలసి ఉండలేని విధంగా పరిస్థితులు ఘనీభవించాయి. మురికివాడలలో నివసించే వారి మధ్య ఆర్థిక అవసరాల దృష్ట్యా మత పరమైన విభేదాలు అంతగా ఉండేవి కావు. అవి వైషమ్యాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వారి మధ్య అదృశ్య సరిహద్దులు నెలకొన్నాయి. ఇవే పరిమితంగా ఉన్న వనరుల అందుబాటును తరచుగా నిర్ణయిస్తున్నాయి.

ఆజాద్ మైదాన్ హింసాకాండ ఒక విధంగా, జడత్వంలో ఉన్న రాజ్య వ్యవస్థకు మరో మేలుకొలుపు వంటిది. పాలక వర్గాలు తమ వైఖరిని సరిదిద్దుకోవాల్సిన సమయమాసన్నమయింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనే వారి పట్ల ఎలాంటి సహనం చూపకుండా కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో ఏ మతానికి చెందిన వారైనా ఎలాంటి ఉపేక్ష భావం చూపకూడదు. ప్రభుత్వ వ్యవస్థ ఇలా ఖచ్చితంగా చర్యలు చేపడితేనే ముంబై లాంటి నగరాలు ఎటువంటి ఉపద్రవాలకు లోనుకాకుండా రక్షించడం సాధ్యమవుతుంది. తాజా కలం: 1992-93, 2012 ఘటనల మధ్య మరో వ్యత్యాసం ఉంది. అప్పట్లో హింసాకాండను తక్షణమే దేశమంతటికీ చూపగల ఓబి వ్యాన్‌లు, టీవీ కెమెరాలు లేవు. అలాగే విద్వేష ప్రసంగాలను, పుకార్లను వ్యాప్తిచేసే సోషల్ మీడియా కూడా లేదు. పలు విధాలుగా మనం చాలా సవాళ్ళును విసిరే కాలంలో నివశిస్తున్నాము.
- రాజ్‌దీప్ సర్దేశాయ్
source: Andhra Jyothi Paper



No comments:

Post a Comment